News

రష్యా సైన్యంలో సహాయకులుగా 100కు పైగా భారతీయులు

294views

అధిక వేతనాలు ఆశ చూపి ఏజెంట్లు చేసిన మోసానికి కొంతమంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయారు. యుద్ధానికి దూరంగా ఉంచుతామనే హామీతో రష్యా వెళ్లిన వారంతా అక్కడి సైన్యంలో చేరి ఉక్రెయిన్‌ సరిహద్దులో బలవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇలా ఇరుక్కుపోయిన భారతీయులు వంద మందికి పైగానే ఉన్నారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని మీడియాకు బహిర్గతం చేశారు.

సైనిక భద్రతా సహాయకులు(ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్‌)గా వీళ్లను తీసుకున్నామని, దాదాపు ఏడాదిన్నరగా ఈ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌తోపాటు పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలకు చెందిన యువతను నియమించుకున్నామని పేర్కొన్నారు. ఇలా చేర్చుకున్న వారికి తాము చేపట్టాల్సిన విధులపై ముందుగానే అవగాహన కల్పించి శిక్షణకు పంపామని చెప్పారు. శిక్షణ అనంతరం వారిని వేర్వేరు సైనిక స్థావరాలకు పంపామని, అక్కడి అవసరాలకు తగినట్టు వారు పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇలా, భారత్‌ నుంచి తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఏజెంట్ల ద్వారా రష్యా వెళ్లినట్టు సమాచారం. వీళ్లంతా ఓ ఏడాది పాటు కచ్చితంగా ఉద్యోగంలో ఉండేలా ఒప్పందం చేసుకుని పనిలో చేరారు. తమ రాష్ట్రాలకు చెందిన వారిని వెనక్కి తీసుకురావాలని ఆయా ప్రభుత్వాలు విదేశీ వ్యవహారాల శాఖను ఆశ్రయించాయి.