News

శబరిమల యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం : వీహెచ్‌పీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

314views

అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల చేరుకునే యాత్రికులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించటానికి అనుమతివ్వాలంటూ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఇదే తరహా పిటిషన్‌ను గత ఏడాది వీహెచ్‌పీ దాఖలు చేయగా కేరళ హైకోర్టు కొట్టివేయడంతో ఆ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యాత్రికులకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న బస్సులు సరిపోవడం లేదని, దీంతో వారు అధిక సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోందని వీహెచ్‌పీ పేర్కొంది. అందువల్ల ఉచితంగా బస్సులు నడపటానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.