News

జ్ఞానవాపి’ సర్వే నివేదికను బహిర్గతం చేయొద్దు ; వారణాసి కోర్టుకు భారత పురావస్తుశాఖ వినతి

225views

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణపై తాము సమర్పించిన సర్వే నివేదికను కనీసం నాలుగు వారాలపాటు బహిర్గతం చేయ రాదని భారత పురావస్తుశాఖ (ఏఎస్ఐ) న్యాయస్థానాన్ని కోరింది. దీంతో వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఎ.కె. విశ్వేష్ ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసినట్లు హిందూ వర్గ న్యాయవాది మదన్మోహన్ యాదవ్ తెలిపారు. సీల్డు నివేదికను తెరిచేందుకు నాలుగు వారాల గడువు కోరిన ఏఎస్ఐ.. అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఓ తీర్పును తమ వాదనకు మద్దతుగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. వారణాసిలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్నచోట ఆలయ పునరుద్ధరణ కోరుతూ దాఖలైన దావాల నిర్వహణను సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు వేసిన పలు పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు డిసెంబరు 19న తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్.. ప్రార్థన స్థలాలు (ప్రత్యేకచట్టం 1991 ప్రకారం) మతపరమైన స్వభావాన్ని నిర్వచించలేవని, కోర్టులో ప్రత్యర్థులు సమర్పించే సాక్ష్యాలనుబట్టి అది రుజువవుతుందని వ్యాఖ్యానించారు. “జాతీయ ప్రాము ఖ్యత కలిగిన కీలకమైన ఈ కేసులో విచారణను వీలైనంత త్వరగా.. కుదిరితే ఆరు నెలల్లో ముగించాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే దిగువ కోర్టు తదుపరి సర్వేకు పురావస్తు శాఖను ఆదేశించవచ్చు” అని హైకోర్టు అభిప్రాయపడింది. వారణాసి కోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీలు వేసిన వజూఖానా (చిన్న కొలను)ను శుద్ధి చేసే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అందులోని చేపలు చనిపోతున్నందున ఎవరో ఒకరు పూనుకొని శుభ్రం చేయాలని హిందూ వర్గం తరపు న్యాయవాది కోరారు. దీనిపై గురువారం వారణాసి జిల్లా కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది.