News

పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ పూజిత అక్షితల పంపిణీ

192views

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో సోమవారం నుంచి ప్రతి గడపకు అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అక్షింతలు పంపిణీ చేపట్టామని సమరసత సేవా ఫౌండేషన్‌ జిల్లా ధర్మ ప్రచారక్‌ మన్నే కుమారస్వామి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఇప్పటికే శ్రీరామ ప్రాణ ప్రతిష్ట అక్షింతలు చేరుకున్నాయన్నారు. సోమవారం నుంచి ఐదో తేదీ వరకు అక్షితలు పంపిణీ ఉంటుందన్నారు. వాటిని తీసుకున్న వారంతా పూజా మందిరంలో వాటిని ఉంచి 22 వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటు విజయ మహామంత్రం పఠిస్తూ ఉండాలన్నారు. 22న అయోధ్యలో రామ ప్రతిష్ట పూర్తయిన తరువాత శిరస్సున ధరించాలని కుమారస్వామి కోరారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షితలకు మన ఇంట్లో బియ్యం, ఆవు నెయ్యి, పసుపుతో వృద్ధి చేసుకుని నిల్వ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. అలా నిల్వ చేసుకున్న అక్షితలను ఇళ్లలో శుభకార్యాలు జరిగిన సమయంలో వినియోగించుకోవచ్చునని ఆయన వివరించారు. 22న అయోధ్యలో రాముని మూలవిరాట్‌ ప్రతిష్ఠ జరుగుతుందని, ఆ రోజు సాయంత్రం తమ ఇళ్ల ముందు ఐదు అంతకన్నా ఎక్కువ దీపాలు వెలిగించి పూజలు చేయాలని కోరారు.