News

పక్షం రోజుల వేడుకగా ప్రాణప్రతిష్ఠ

223views

అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 15 రోజులపాటు దేశమంతా వేడుకగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రతి ఇంటా రామజ్యోతులు వెలిగించడం, ఆలయాలను శుభ్రపరచడం, భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాల కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలో రామవిగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుండగా.. 14 నుంచి 27వ తేదీ వరకు వేడుకల షెడ్యూలును ఖరారు చేశారు. ప్రాణప్రతిష్ఠ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఇంట్లో అయిదు దీపాలు వెలిగించేలా కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం దేశంలో దీపావళి తరహా వాతావరణం కనిపించాలని వీరు కోరనున్నారు.

జనవరి 25 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా భక్తులు రామమందిరాన్ని సందర్శించేలా తమ కార్యకర్తలకు సహాయం చేయాలని, అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహించాలని విహెచ్‌‌పి ఇప్పటికే సూచించింది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజూ 50 వేలమంది భక్తులు రాముణ్ని దర్శించుకుంటారని అంచనా. వీరికి ప్రయాణ, వసతి సౌకర్యాలు, ఇతర అంశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు సాయం చేయనున్నారు.