
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం’తో (XPoSat) సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ బయలుదేరింది.
పేలోడ్లు ఇవే..
ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఎక్స్‌పోశాట్ లక్ష్యం..
ఎక్స్‌పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనేమనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు.
ఎక్స్‌పోశాట్ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్ బహిర్గతం చేస్తుంది.
చివరి దశలో POEM..
పీఎస్‌ఎల్‌వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనికి ‘పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)’ అని నామకరణం చేశారు. దీంట్లోనే తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్‌ను ఉంచారు.





