News

కాశీ – తమిళ్‌ సంగమంలో శ్రీరామునికి స్వర నీరాజనం

467views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న కాశీ – తమిళ్‌ సంగమ వేడుకలు శనివారంతో ముగిశాయి. ఈ వేడుకల సందర్భంగా స్థానిక గంగానది ఘాట్లలో శ్రీరామునికి స్వర నీరాజనాలు పలుకుతూ ఏర్పాటుచేసిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని రెండు పురాతన విద్యాకేంద్రాలైన తమిళనాడు, కాశీల నడుమ అనుబంధాల పునరాన్వేషణ లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ సంగమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జరిగిన ఈ వేడుకలకు తమిళనాడు, పుదుచ్చేరి, వారణాసితోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 1,400 మంది ఔత్సాహిక ప్రతినిధులు హాజరయ్యారు. నమో ఘాట్‌లో బనారస్‌ ఘరానాకు చెందిన పండిట్‌ దేవబ్రత్‌ మిశ్ర్‌ బృందం శ్రీరాముడికి ‘బందిష్‌’ (స్వరరచన)ను సమర్పించింది. ‘‘అవధ్‌ మే కైసీ ధూమ్‌ మచీ హై, రామ్‌ నామ్‌ నే లియే అవతార్‌’’ (అవధ్‌లో సంబరాలు జరుగుతున్నాయి, రాముడు అవతరించాడు) అంటూ ఇది సాగింది.