
( డిసెంబర్ 16 – బోయి భీమన్న వర్ధంతి )
సమాజంలో సమానత్వం అనే భావన స్థిరపడడానికి సోదరభావం అనేది అత్యంత అవసరం. కాని వివిధ కారణాల వలన సమతుల్యత లోపించడంతో ప్రజల మధ్య అపోహలు, అసమానతలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించడానికి సాహిత్యం ద్వారా కృషి చేసిన మహనీయులు బోయి భీమన్న. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్‌తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి బోయి భీమన్న.
బానిసతనమును బాపుమురా..భారత భూమికి భాగ్యము తేరా! సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపుమురా!! అంటూ తన రచనలతో అణగారిన సమాజాన్ని ప్రేరేపించిన సమరసతా సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభావాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త 1911 సెప్టెంబర్ 19న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో హరిజన దంపతులు పుల్లయ్య, నాగమ్మలకు జన్మించారు. విద్యాభ్యాసం పూర్తయిన తొలిరోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టియన బోయి భీమన్న ఆ తర్వాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ పత్రికల్లో పని చేశారు.
అంబేడ్కర్ రాసిన ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్ గ్రంథాన్ని కుల నిర్మూలన పేరుతో తెలుగులోకి అనువదించిన బోయి భీమన్న అంతే త్రికరణశుద్ధితో అంబేడ్కర్ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు. పాలేర్లు, రైతు కూలీలు తమ బిడ్డలను చదివించాలని తద్వారా వారి అభివృద్ధికి బాటలు వేయాలని ‘పాలేరు’ నాటకం ద్వారా ఆయన ఉద్బోధించారు. జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే సమాజానికి మంచి విషయాన్ని పదే పదే ఉద్బోధించాలని ఆయన చెప్పేవారు. వ్యక్తుల వికాసమే జాతి. జాతి వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం అన్నది భీమన్న తాత్విక భూమిక. కవి ఏ కాలంలో జీవించాడో, ఆ కాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దంపడుతుంది.

సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం. అజరామరం. హరిజనులుగా సమాజంలో పిలువబడిన వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి సమకాలీన సమాజంతో వారు గౌరవానికి అర్హులయ్యేట్టు చేయడం బోయి భీమన్న సాహిత్య లక్ష్యం. సంస్కరణ, జాతీయవాద దృష్టి కలగలసిన అద్భుత సమరసతా కవితా మూర్తి భీమన్న అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. సామాజిక సమరసత, సాహితీ సమర్చన అన్న అంశాలను రెండు కళ్లుగా చేసుకొని భీమన్న జీవించారు. కులం లేని జాతి ఆవిర్భావం కోసం కలలు కన్నారు. కుల మతాల కంటే మానవతకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయితగా పేరు గాంచిన బోయి భీమన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారంతో పాటు పలు సన్మానాలు అందుకున్నారు. ఆయన రచించిన ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ అన్న గ్రంధానికి 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు 1971లో కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు. తెలుగు సాహితీ రంగానికి ఆ మహనీయుడు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ పురస్కారం, 2001లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
బోయి భీమన్నను ప్రతిభాశాలిగా నిలబెట్టిన ఆయన రచనలలో దీప సభ కావ్యం, పాలేరు, కూలి రాజు, రాగం వాశీష్టం, బాలయోగి అన్న నాటకాలు, పైరు పాట, మానవుని మరొక మజిలీ గేయ నాటికలు, జానపదుని జాబులు, పిల్లి శతకం మొదలైనవి ప్రముఖమైనవి. ఆయన 2005 డిసెంబర్ 16న కన్ను మూశారు. బోయి భీమన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపిన సమరసతా మార్గం మనకు ఎంతో అనుసరణీయం. బోయి భీమన్న ఆశయాల దిశగా అడుగులు వేయడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.





