
296views
బీజేపీను ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన రెండు బిల్లులపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాశ్మీర్ లో గెలవలేమని తెలిసే ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, గవర్నర్ ద్వారా అధికారం చెలాయిస్తోందని ఎంపీ సెంథిల్ కుమార్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలువలేదని జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.సెంథిల్ వ్యాఖ్యలను బీజేపీ , కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నేతలు కూడా ఖండించారు. ఆయన ఉత్తరాది ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.





