
(నవంబర్ 24 – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి)
భారత స్వాతంత్ర్య ఉద్యమం అనగానే అందరికీ గుర్తొచ్చేది 1857 నాటి సిపాయిల తిరుగుబాటు. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై తిరుగుబాటు బావుటా ఎగురువేశాడు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి వందల కొద్దీ సైన్యాన్ని సమకూర్చాడు. అతడు బ్రిటిషు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొలేకపోవచ్చు, ఏడాది కూడా తన పోరాటాన్ని కొనసాగించలేక ప్రాణాలు విడిచి ఉండొచ్చు… కానీ అతని పోరాటం ఎంతో మందిలో ఉద్యమ స్పూర్తిని నింపింది. వేల మంది… స్వాతంత్ర్య ఉద్యమం దిశగా అడుగులేసేలా చేసింది. ఆ ఉద్యమస్ఫూర్తిని నింపిన వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. అతడిపై బందిపోటు దొంగగా ముద్ర వేసింది బ్రిటిషు ప్రభుత్వం. 175 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 22 ఉదయం ఏడుగంటల ప్రాంతంలో కోవెలకుంట్ల సమీపంలోగల జుర్రేరు ఒడ్డున ప్రజల ముందే ఉరితీసింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషు వారిని వ్యతిరేకించడం తొలిగా మొదలుపెట్టింది 1942లో. అయితే యుద్ధం రూపంలో తిరుగబాటును మొదలుపెట్టింది మాత్రం 1846 జూన్‌లో. ఆ పోరాటానికి ఏడాది పూర్తవ్వక ముందే 1847 ఫిబ్రవరిలో బ్రిటిషు వారికి పట్టుబడ్డారు. మధ్యలో ఆయన పోరాటం జరిపింది కేవలం ఏడెనిమి నెలలే. ఆ తక్కువ కాలంలోనే బ్రిటిషు వారి వెన్నులో వణుకుపుట్టించారు. ఆ ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిల్చారు. తల్లి, భార్యా బిడ్డను వదిలి పోరాటానికి సిద్ధమయ్యారు. అడవుల్లో తలదాచుకుంటూ అనువుచూసి బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అందుకే అతడిని త్వరగా పట్టుకుని ప్రాణాలు తీయాలని నిర్ణయించుకుంది బ్రిటిష్ ప్రభుత్వం.

18వ శతాబ్ధంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవాడ కూడా ఒకరు. దాదాపు 80 మంది పాలెగాళ్లను నిజాం నవాబు…బ్రిటిషు ప్రభుత్వ ఆధీనం చేశారు. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ కాపు పెదమల్లారెడ్డి రెండో భార్య. ఆమె తండ్రి కూడా జమిందారే. పేరు జయరామిరెడ్డి. అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామిరెడ్డి మరణం తరువాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది బ్రిటీషు ప్రభుత్వం. అతడి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే చాలా అవమానించి పంపాడు తహసీల్దార్. ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని, 500 బోయ సైన్యముతో కలిసి బ్రిటిష్ ట్రెజరీపై 1946 జులై 10న దాడి చేశారు. ఆ ట్రెజరీ కోయిలకుంట్లలో ఉంది. అక్కడున్న తహసీల్దారును కూడా చంపేశారు. దీంతో బ్రిటిష్ సైన్యం అతనిని వెతకడం మొదలుపెట్టింది. అతడిని పట్టుకున్న వారికి భారీ బహుమతులు కూడా ప్రకటించారు. నరసింహారెడ్డి మరింత సైన్యాన్ని సమకూర్చుకుని గిద్దలూరు వద్ద కెప్టెన్ వాట్సన్‌తో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలా మేరకు సైన్యాన్ని నష్టపోయారు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్‌లో నల్లమల కొండల్లో గల జగన్నాథ ఆలయంలో ఉండగా బ్రిటిష్ సైన్యం అతడిని బంధించింది. అతడితో పాటూ 901 మందిని పట్టుకుంది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు.

నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, హత్యలు, దోపిడిలకు పాల్పడ్డాడని, అతడో దోపిడి దొంగ అని బ్రిటిష్ స్పెషల్ కమిషనర్ తీర్పునిచ్చారు. అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్టు ప్రకటించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు. అతడి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడేదీసే ఉంచారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం చేసింది తక్కువ కాలమే కావచ్చు కానీ ఎంతో మంది అతడిని స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో చేరారు. 18వ శతాబ్ధం తొలినాళ్లల్లో నవంబర్ 24న జన్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..ఆ రోజుల్లో ఎవరు సాహసించలేని, చూపించలేని ధైర్యాన్ని ప్రదర్శించి భారతీయ స్వతంత్ర పోరాటంలో ఒక మూర్తీభవించిన సమరయోధుడిగా ఎదిగి చిరస్థాయిగా నిలిచారు. వారి పోరాట జ్వాలను మనం అందుకుని మనం కొనసాగించాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఉద్వేగంతో చెప్పుకోవడం మాత్రమే కాదు వారు అందించిన స్ఫూర్తిని సరిగ్గా అందుకొని ఎందరో చేసిన ప్రాణత్యాగాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత కేవలం భారతీయుల మీద మాత్రమే ఉంది.





