News

అయ్యప్ప భక్తుల కోసం యాప్‌

337views

ఇది అయ్యప్ప దీక్షల సమయం. మండల దీక్ష పూర్తి కాగానే భక్తులు ఎంతో శ్రమపడి శబరిమల ఆలయాన్ని చేరుకుంటారు. ఈ మధ్యలో దాదాపు యాభై కిలోమీటర్లు అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. వన్యప్రాణులు సంచరించే ఆ బాటలో భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి అటవీశాఖ ‘అయ్యన్‌’ యాప్‌ను రూపొందించింది.

ఆ మార్గంలో సేవా కేంద్రాలూ, హెల్త్‌ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్‌, ఫైర్‌ ఫోర్స్‌, పోలీస్‌ ఎయిడ్‌ పోస్ట్‌, తాగునీటి పాయింట్లతోపాటు ఇంకెన్నో సేవలకోసం అధికారుల్ని సంప్రదించొచ్చు. భక్తులకోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ సేవలు అందించే ఈ యాప్‌ తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దట్టమైన అడవిలో నడిచి వచ్చే భక్తులకు వన్యప్రాణుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కేరళ అటవీశాఖ అధికారులు ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులపై చిరుతలు దాడిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు అక్కడ కూడా చోటు చేసుకునే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం.

అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు లాంటి వన్యమృగాలు దాడిచేసినట్లయితే.. ఈ యాప్‌ ఉపయోగించి.. వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను రూపొందించారు. గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.