News

తిరుమ‌ల‌లో ల‌క్ష్మీకాసులహారం శోభాయాత్ర ; తిరుచానూరుకు చేరిన హారం

91views

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు.

తిరుచానూరులో ….

అనంత‌రం తిరుమ‌ల‌ నుండి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం కాసులహారాన్ని అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ కు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు.