News

ప్రజల వద్దకే తపాలా సేవలు అందించేలా తపాలాశాఖ పోస్ట్‌ ఇన్ఫో యాప్‌, ఐపీపీబీ యాప్‌లు

273views

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ తన సేవలను విస్తృతం చేస్తోంది. నేటి పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ప్రజలు, ఖాతాదారులకు చేరువయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ విధానంలో తపాలా సేవలను అందించేందుకు పోస్ట్‌ ఇన్ఫో యాప్‌, ఐపీపీబీ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తామున్న చోట నుంచే అన్ని పథకాలు, బ్యాంకు చెల్లిపులు, బీమా వంటి సేవలు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది.

పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ ద్వారా నగదు పొందడం, కొత్త పొదుపు పథకాల ప్రారంభించడంతో పాటు తపాలా స్టాంపులు తీసుకోవచ్చు. ఇందుకోసం సర్వీస్‌ రిక్వెస్టు పెడితే తపాలా ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి ఖాతాదారులకు సేవలందిస్తారు. తపాలా స్టాంపులను కూడా ఇంటి వద్దకే పంపుతారు.

తపాలా బీమా పథకాలు పొందాలంటే బీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి బీమా ప్రీమియం తీసుకుంటారు. మనకు ఎవరైనా పంపించే పార్శిల్‌ బరువును నమోదు చేసి దాని ఆధారంగా ఎంత ఛార్జీలను చెల్లించాలో ముందే తెలుసుకోవచ్చు.

పోస్ట్‌ ఇన్ఫో, ఐపీపీబీ యాప్‌ ప్రత్యేకతలు

పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ను మొబైల్ లోని ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో సర్వీస్‌ రిక్వెస్ట్‌, ఆర్టికల్‌ ట్రాకింగ్‌, పోస్టేజ్‌, వడ్డీ క్యాల్కులేటర్‌, బీమా, ఆన్‌లైన్‌ ఎన్‌పీఎస్‌, కంప్లైంట్‌ ట్రాకింగ్‌, ఫీడ్‌బ్యాక్‌, ఫిర్యాదుల నమోదు వంటి విభాగాలు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ డిపాజిట్లపై వడ్డీ లెక్కించుకునే సదుపాయం, ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా పథకాలను ఎంచుకొని డిపాజిట్‌ చేస్తే వచ్చే ఆదాయ వివరాలు తెలుసుకోవచ్చు. పిన్‌కోడ్‌ నెంబరును పొందుపరిస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్‌ పరిధిని తెలియజేస్తుంది. తపాలా సేవలపై ఖాతాదారులు తమ అభిప్రాయాన్ని (ఫీడ్‌బ్యాక్‌) తెలియజేయవచ్చు.

ఖాతాదారులు డిజిటల్‌ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఐపీపీబీ (ఇండియన్‌ పోస్టల్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌) యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు, చరవాణి సంఖ్యతో ఖాతా తెరవాలి. ఇందులో ఖాతాదారులు రూ.లక్షకు మించి డబ్బులు నిల్వ చేసుకునే వీల్లేదు. ఖాతాదారులు ఐపీపీబీ నుంచి పీవోఎస్‌బీ (పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌)కి ఎంత మొత్తమైనా చెల్లింపు చేసుకునే వీలుంది. ప్రమాద బీమా, వైద్య బీమా వంటి సేవలను ఖాతాదారుకు అందుబాటులోకి తెచ్చింది.

తపాలా యాప్‌ల ద్వారా ఖాతాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే తపాలా సంబంధిత సేవలు పొందవచ్చు. ఐపీపీబీ యాప్‌ ద్వారా ఎక్కడైనా డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవచ్చని తపాలా అధికారులు పేర్కొన్నారు.