News

చైనా, పాక్‌ సరిహద్దుల్లో ఎస్‌-400ల మోహరింపు..

89views

భారత వాయుసేన మూడు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో రెండు రెజిమెంట్లపై మాస్కోతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని దానిలో వెల్లడించారు.

భారత్‌ దాదాపు రూ.35 వేల కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018-19లో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ డీల్‌ కింద ఐదు రెజిమెంట్లను మన దేశం అందుకోనుంది. ఇప్పటికే మూడు భారత్‌కు చేరుకొన్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా మిగిలిన రెజిమెంట్ల డెలివరీలో జాప్యం చోటు చేసుకొంది. భారత్‌కు చేరిన వాటిల్లో ఒక దానిని చైనా-పాక్‌ సరిహద్దులపై నిఘా వేసేలా.. మిగిలిన రెండింట్లో ఒక్కో దానిని పాక్‌, చైనా సరిహద్దుల వద్ద వేర్వేరుగా మోహరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయని ఆంగ్లవార్త సంస్థ పేర్కొంది.

మిగిలిన రెండు రెజిమెంట్లకు సంబంధించి డెలివరీలపై రష్యా అధికారులతో చర్చలు జరుపేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఇవి కచ్చితంగా ఎప్పుడు అందిస్తారో చెప్పలేని స్థితిలో రష్యా ఉంది. ఇప్పటికే భారత్‌ కోసం తయారు చేసిన ఎస్‌-400 వ్యవస్థలను ఉక్రెయిన్‌పై యుద్ధంలో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

చమురు ధరలతో యుద్ధమే

పాకిస్థాన్‌, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ సరిహద్దులను మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌ వద్ద అధునాతన మిగ్‌-29 యుద్ధ విమానాలను మోహరించింది. గతంలో ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్‌-21’ స్క్వాడ్రన్ విధులు నిర్వహించగా.. ఇప్పుడు వాటి స్థానంలో మిగ్‌-29 యుద్ధ విమానాలను దింపింది. ‘డిఫెండర్‌ ఆఫ్‌ ది నార్త్‌’గా పిలిచే మిగ్‌-29 స్క్వాడ్రన్‌.. చైనా, పాక్‌ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా అడ్డుకోగలదని వాయుసేన దళాలు చెబుతున్నాయి.