
భారత సైన్యానికి చెందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ (ఎల్‌సీహెచ్) ‘ప్రచండ్’.. సోమవారం విజయవంతంగా 70 ఎంఎం రాకెట్లను ప్రయోగించింది. రాత్రి, పగటి వేళల్లో ఈ పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అస్సాంలోని లికాబలి వద్ద ఉన్న ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదిక అయింది. అలాగే హెలికాప్టర్‌కు అమర్చిన 20 ఎంఎం టర్రెట్ గన్ నుంచి కూడా తూటాలను పేల్చి చూశారు. సైన్యంలోని వైమానిక విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఎ.కె.సూరి సమక్షంలో ఈ పరీక్షలు జరిగాయి. ఇందులో మూడు ప్రచండ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 5.8 టన్నుల బరువైన ఈ లోహ విహంగాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇవి పలు రకాల ఆయుధాలను మోసుకెళ్లగలవు. శత్రు ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లను ధ్వంసం చేయగలవు. ప్రత్యర్థులను ఏమార్చే ఆధునిక స్టెల్త్ సామర్థ్యం ఈ హెలికాప్టర్ సొంతం. రాత్రిపూట కూడా పోరాడగలదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రణక్షేత్రం సియాచిన్‌లో పనిచేసేలా దీన్ని రూపొందించారు. యుద్ధరంగంలో గాలింపు చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. అటవీ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు తోడ్పడగలదు. ప్రచండ్‌ను గత ఏడాది లాంఛనంగా సైన్యం, వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.





