
విలువైన లోహాలతో కూడిన ఒక అరుదైన గ్రహశకలంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా.. సైకీ అనే వ్యోమనౌకను శుక్రవారం నింగిలోకి ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన రాకెట్ ద్వారా కేప్ కెనావెరాల్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. సైకీ వ్యోమనౌక రోదసిలో ఆరేళ్లపాటు ప్రయాణించి 2029లో ‘16 సైకీ’ అనే గ్రహశకలాన్ని చేరుకుంటుంది. చాలావరకూ గ్రహశకలాలు రాతిమయంగానో లేక హిమమయంగానో ఉంటాయి. 16 సైకీ మాత్రం పూర్తిగా లోహాలతో నిండి ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటివి 9 వెలుగు చూశాయి. వాటిలో 16 సైకీ పెద్దది. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న ప్రధాన గ్రహశకల వలయంలో ఉంటూ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తోంది. దీన్ని 1852లో కనుగొన్నారు. గ్రీకు దేవత పేరును దీనికి ఖరారు చేశారు. భూమి మధ్యలో ఉండే లోహపు కోర్ భాగంలోకి చేరుకొని పరిశోధనలు సాగించాలన్నది మానవుల కల అని సైకీ బృంద ప్రధాన శాస్త్రవేత్త లిండీ ఎల్కిన్స్ పేర్కొన్నారు. అయితే అక్కడ పీడనం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అందువల్ల అక్కడికి చేరుకునే పరిజ్ఞానం ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు. సైకీపై పరిశోధనలు చేయడం ద్వారా ఆ లోటును అధిగమించవచ్చని చెప్పారు. ఆ గ్రహశకలం కూడా.. ఒక గ్రహంలోని కోర్ భాగాన్ని పోలి ఉంటుందన్నారు. అది 232 కిలోమీటర్ల వెడల్పు, 280 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అందులో ఇనుము, నికెల్, ఇతర లోహాలు, సిలికేట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్వల్ప పరిమాణంలో బంగారం, వెండి, ప్లాటినం, ఇరీడియం వంటివీ అక్కడ లభించొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు.. గ్రహాల నిర్మాణంలో ఇటుకల్లా వ్యవహరించి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.





