News

ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండదు : ఇస్రో ఛైర్మన్‌

236views

చంద్రుడిపై ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి మేల్కోకపోయినా ఎలాంటి సమస్యా ఉండబోదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ఇస్రో ఆశించిన పనిని రోవర్‌ ఇప్పటికే పూర్తిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము తదుపరి ప్రయోగాలపై దృష్టిపెట్టామని చెప్పారు.

రోవర్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లాక చంద్రుడిపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ దాకా పడిపోయాయని తెలిపారు. అంతటి శీతల వాతావరణం వల్ల దానిలోని ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్‌ దెబ్బతిని ఉండకపోతే ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇస్రో ఎక్స్‌పోసాట్‌/ఎక్స్‌రే పొలరీమీటర్‌ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోందన్నారు. కృష్ణబిలాలు, నెబ్యులాలు, పల్సర్లపై ప్రయోగాలు జరిపేందుకు.. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నవంబరు లేదా డిసెంబరులో దాన్ని నింగిలోకి పంపుతామని తెలిపారు. డిసెంబరులో ఇన్‌శాట్‌-3డీఎస్‌ను (వాతావరణ ఉపగ్రహం) ప్రయోగిస్తామని చెప్పారు. నవంబరు లేదా డిసెంబరులో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిసార్‌ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు.