ArticlesNews

విశ్వనరుడను నేను అని ఎలుగెత్తి చాటిన కవి కోకిల గుర్రం జాషువా

532views

(సెప్టెంబర్ 28 – గుర్రం జాషువా జయంతి)

ఏ దేశమైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే ముందుకు కావాల్సింది ఆ దేశపు ప్రజల మధ్య ఐక్యత. ఐకమత్యమే బలం. ఐకమత్యంతోనే ప్రగతి సాధ్యం. ప్రజలమధ్య సామరస్యం ఉంటే ఐకమత్యం దానంతట అదే నెలకొంటుంది. కనుక సామరస్యం ముందుగా సాధించవలసిన అత్యంత అవసరమైన అంశం. అసమానతలతో, అంతరాలతో ఛిన్నాభిన్నమైన సమాజం ఎన్నటికీ ప్రగతి మార్గాన పయనించలేదు. అందుకే సామాజిక సమరసతకు అంత ప్రాముఖ్యం. సామాజిక అసమానతలు తగ్గినప్పుడే మనదేశం ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేయగల్గుతుంది. సమాజంలో సమానత్వం అనే భావన స్థిరపడడానికి సోదరభావం అనేది అత్యంత అవసరం. కాని వివిధ కారణాల వల్ల సమతుల్యత లోపించిన కారణంగా ప్రజల మధ్య అపోహలు, అసమానతలు ఏర్పడినవి. వీటిని పరిష్కరించేందుకే గుర్రం జాషువా లాంటివారు సాహిత్యం ద్వారా కృషి చేశారు.

జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో జాషువా పొందుపరిచారు. సింధు, గంగా నదుల జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్నదేశాన్ని కీర్తించారు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పారు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉన్న మహనీయుల గురించి, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించి ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యం …ఇవి దేశభక్తిని పాదుకొల్పేవిగా జాషువా పేర్కొన్నారు. సామాజిక సమానత, సంక్షేమం కోసం జాషువా కవిత్వం రాశారు.

గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం వీరయ్య – లింగమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో విద్యాభ్యాసంలో అనేక కష్టాలు, అవమానాలు, ఛిత్కారాలు ఎదుర్కొన్నారు. ప్రతి మనిషిలో ప్రవహించేది ఒకటే రక్తమైనప్పుడు ఈ వివక్షలు ఎందుకు అని తనని తాను ప్రశ్నించుకుంటూ…తాను అనుభవిస్తున్న పేదరికం, కులమత భేదాలనే తన గురువులుగా మలచుకొని సాహిత్యాన్ని వినిపించడం మొదలు పెటారు జాషువా. నాడు సమాజాన్ని పీడిస్తున్న మూఢాచారాలు, వర్ణవివక్ష అంశాలుగా ఎన్నో రచనలు చేశారు.

ప్రపంచంలోని ఏ జీవరాశికి లేని వర్ణ వివక్ష మనుషులకు మాత్రమే ఎందుకు ఉంది. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు నిమ్నజాతివారికి ఆలయాలలో ప్రవేశం ఎందుకు ఉండదు. తన మొరను వినమని దేవాలయ ప్రాంగణంలోనే నివసించే గబ్బిలం ద్వారా సందేశాన్ని పంపిస్తూ రాసిన గబ్బిలం పద్యఖండిక ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఎన్నో గ్రంథాలను, మరెన్నో కవితా ఖండికలను సందర్భానుసారంగా జాషువా రచించారు. ఆయన రచనలే సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఉనికిని స్థిరపరిచాయి. అనేక పురస్కారాలతో పాటు పద్మభూషణ్ గౌరవం కూడా దక్కేలా చేశాయి.

గుర్రం జాషువా 19వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో తన రచనలు కొనసాగించారు. ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించారే తప్పా దేశాన్ని, దేశభక్తిని, సమాజాన్ని ప్రేమించారు. జాషువా రచనల్లో తన జిల్లా గుంటూరును, తన రాష్ట్రం మీద, దేశం మీద జాషువాగారికి ఎనలేని వాత్సల్యం, గౌరవం, అభిమానం తొణికిసలాడతాయి. ఆయన కోరిన జాతి సమైక్యతలో జీవనరాగం కనిపిస్తుంది. ప్రపంచం సర్వ సుభిక్షం కావాలన్నదే అయన మతం. ఎల్ల సోదరులు ఏకోదారులై నిరంతరం ఆనంద జీవనం గడపాలన్నదే ఆయన కోరిక. జాషువా స్ఫూర్తితో విద్యార్థులు, యువత దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు కులతత్వాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలి.