
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంతో ఇస్రో మరో కొత్త మిషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అదే వీనస్ మిషన్. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన వీనస్ (శుక్రుడు) కోసం భారత్ మిషన్ సిద్ధమైందని తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన పేలోడ్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు ఆయన తెలియజేశారు.
ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సోమనాథ్ మాట్లాడుతూ.. వీనస్‌కు మిషన్ ఇప్పటికే ప్రణాళిక చేయబడింది. దీనికోసం ఇప్పటికే పేలోడ్స్‌ని అభివృద్ధి చేయడం జరిగింది. వీనస్ ఒక ఆసక్తికరమైన గ్రహం. దీనిని అన్వేషించడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’’ అని అన్నారు. వీనస్‌కి వాతావరణం ఉంటుందని, అది ఎంతో దట్టమైనదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ని వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.





