News

బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే

84views

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో తన ఆధ్వర్యంలో చేపడుతున్న కుల గణనను హైకోర్టు నిలిపేసింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. నిజానికి కుల గణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకు నితీష్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సార్లు కోరారు. దీనిపై కేంద్రం నుంచి సరైన సమధానం లేకపోవడంతో నితీష్ ప్రభుత్వమే స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణనకు పూనుకుంది. ఈ గణనకు బీజేపీ మినహా బిహార్‭లోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. దీంతో జనవరి 7న అధికారికంగా కుల గణన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కులాల వారీగా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిని తెలుసుకునే సర్వేలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని విమర్శలు వచ్చాయి.తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వే పై వస్తున్న వ్యతిరేకతపై నితీశ్ కుమార్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో వెనుకవడిన వర్గాల ప్రజలకు ఈ సర్వే ద్వారా మెరుగైన లబ్ధిని అందిస్తుందని, ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో ఆరంభించిన ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతోంది. అయితే ఇప్పటికే ఒక సర్వే పూర్తైంది. మొదటి విడతలో జనవరి 7 నుంచి 21 తేదీ వరకు మధ్య కులాల సర్వే జరిగింది. ఇక రెండవ విడత సర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నిర్వహించాలి. కానీ కొన్ని అభ్యంతరాలు, అడ్డంకుల నడుమ సర్వే అర్ధాంతరంగా నిలిచిపోవాల్సి వచ్చింది.