
భారత్ లో నిర్వహిస్తున్న జీ-20 సదస్సుల్లో భాగంగా మే 22-24 మధ్యలో శ్రీనగర్‌లో సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ ఇక్కడ సమావేశం కానుంది. ఈ పరిణామాలపై పాక్ విదేశాంగశాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. భారత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పాక్ విమర్శించింది. ఐరాస ఛార్టర్‌ను, అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. శ్రీనగర్ వివాదాస్పద ప్రాంతమని పాక్ పేర్కొంది. ఇప్పటికే కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపును నిర్ణయాన్ని పాక్, చైనా ఖండించాయి.
దేశ వ్యాప్తంగా 15 సంస్థల్లో యూత్-20, సివిల్-20 కన్సల్టేషన్ మీటింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో కశ్మీర్ యూనివర్శిటీ కూడా ఉంది. నేడు కేంద్ర హోంశాఖ అమిత్‌షా నేతృత్వంలో జీ-20 సదస్సు ఏర్పాట్లపై దిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి పురోగతి , వివిధ ప్రాజెక్టులపై దీనిలో చర్చించనున్నారు. దీంతోపాటు కశ్మీర్ డీజీపీ దల్బీర్ సింగ్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా ఈ సమీక్షకు హాజరుకానున్నారు. మరోవైపు వచ్చే నెల గోవాలో జరగనున్న ఎస్‌సీవో సదస్సులో పాల్గొనాలని పాక్‌కు భారత్ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు పాక్ విదేశాంగ మంత్రి తన నిర్ణయం వెల్లడించలేదు. ఎస్‌సీవో ప్రధాన సమావేశానికి పాక్ పీఎం వచ్చే అవకాశాలున్నాయి.





