
భక్తుల పాలిట కొంగు బంగారం మార్కాపురంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చెన్నుని కళ్యాణ శోభలో చూసిన భక్తజన కోటి పులకించారు. చెన్నుడు చైతన్యానికి, జాగృతికి, ప్రగతికి ప్రతీక అయితే దేవేరి రాజ్యలక్ష్మి సంపదలకు ప్రతీక. రాజ్యలక్ష్మి అమ్మవారే కల్యాణ సమయంలో శ్రీదేవి, భూదేవులుగా కొలువు తీరారు.
చెన్నుని కల్యాణాన్ని సీమాంద్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై చెన్నకేశవ నామ స్మరణల మధ్య లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యానాన్ని నిర్వహించారు. గురువారం అర్థరాత్రి నుంచి కల్యాణ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. భేరిపూజ, సకల దేవత ఆహ్వానం తదితర పూజా కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ముందుగా సూర్యప్రభ వాహనంపై నగరోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై శ్రీదేవీ భూదేవి సమేత చెన్నకేశవుని ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించారు. వేదపండితులు కల్యాణ పాదపక్షాళన, కంకణధారణ, బాసికాలు, మోక్షబంధనం, ప్రతిసర బంధనం, ఆశీర్వచనం, మధుపర్కప్రాసన అనంతరం లోకక్షేమం కోసం మహా సంకల్పం పఠించి కన్యాదానం తదితర ఘట్టాలు నిర్వహించారు. మంగళ సూత్ర ధారణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, సోమయాజుల మల్లిఖార్జునశర్మ తదితరులు శాస్రోక్తంగా నిర్వహించారు. శ్రీపతి అనంతకుమారాచార్యులు కళ్యాణ ఘట్టాలపై వ్యాఖ్యానం నిర్వహించారు.
వంశపారంపర్యంగా ఆమంచి చంద్రశేఖర్ దంపతులు స్వామికి అమ్మవార్లకు వస్ర్తాలు, మంగళసూత్రాలు సమర్పించారు. మున్సిపల్ శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, డీఎస్పీ కిషోర్‌కుమార్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెనుగొండ కేశవరావు, ఈవో జి.శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు పట్టువస్ర్తాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం, అచ్యుత పెద్దవెంకటేశ్వర్లు, మేడా బద్రీనాథ్, గ్రంధే సురేష్ సమర్పించారు. బచ్చు సుబ్రహ్మణ్యం, పాండు రంగసీతారామ మహిళా సమాజం దుగ్గిరెడ్డి కృష్ణారెడ్డిలు ప్రసాద పంపిణీ నిర్వహించారు. సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
చంద్రవాహనంపై చెన్నకేశవుడు
బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి శుక్రవారం రాత్రి చంద్రవాహనంపై నగరంలో వివహరించారు. శ్రీమన్నారాయణ మూర్తి అలంకారంలో నాలుగు మాఢవీధులలో శ్రీవారికి ఊరేగింపు నిర్వహించారు. చందుడు సర్వ ఔషదులకు అధిపతి సర్వప్రాణుల మనస్సులకు సంబంధించిన వాడని సర్వప్రాణులను ఉత్తేజ పరచువాడు చంద్రుడని ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
రాచర్ల మండలంలోని జే.పుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన రంగ నాయకస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కల్యాణం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు అశేషభక్తులు తరలివచ్చారు. దీంతో సభాప్రాంగణ మంతా భక్తులతో కిటకిటలాడింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో కల్యాణం ప్రారంభం కాగా దాదాపు 2 గంటలపాటు భక్తులు ఈ కల్యాణాన్ని వీక్షించారు. వేదపండితులు సత్యనారాయణచార్యుల ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. అనంతరం చినగానిపల్లె సర్పంచ్ పగడాల రమేష్ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య, శ్రీకృష్ణదేవరాయల బలిజ, యాదవ, ఇతర అన్నదాన సత్రాలలో అన్నదానం నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పించారు. గిద్దలూరు సీఐ ఎం.డి.ఫిరోజ్ ఆధ్వర్యంలో బేస్తవారపేట, రాచర్ల, కంభం, కొమరోలుకు చెందిన స్థానిక ఎస్సైలు మహేష్, నాగమల్లేశ్వరరావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, దేవస్థాన ట్రస్టు చైర్మన్ కన్నసాని ఓబులేసు, డీఎఫ్‌వో నరసింహారావు, సూరా పాండు రంగారెడ్డి, నాగిరెడ్డి, మధు, గోపి, మౌలాలి, రంగనాయకులు, మోహన్‌రావు, కె.రంగనాయకులు, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటనారాయణ, సిఆర్‌ఐ మురళి, జడ్‌పిటిసి పగడాల శ్రీరంగం, జనార్థన్ పాల్గొన్నారు.




