News

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు

209views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీవారి ఆలయం మొదలుకొని, నాలుగు మాడవీధులు, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, అఖిలాండం, క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, రోడ్లు, బస్టాండ్‌ ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపించింది. స్లాటెడ్‌ దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుంటే.. టోకెన్‌ రహిత సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ నారాయణగిరి కాటేజీలు, శిలాతోరణం మీదుగా గోగర్భం డ్యాం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దాకా వ్యాపించింది. పరిమిత సంఖ్యలోనే గదులున్న నేపథ్యంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. సోమవారం మఽధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.