News

అంగరంగ వైభవంగా కోదండరామస్వామి కల్యాణోత్సవం

246views

నిండు పున్నమి వెన్నెల కాంతు ల్లో ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాక్షాత్‌ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వరుడు కోదండరామస్వామి వారికి సాక్షాత్‌ లక్ష్మీ స్వరూపిణి అయిన వధువు సీతమ్మవారికి బుధవారం రాత్రి 9.23 గంటల సమయంలో హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో మాంగల్యధారణ గావించారు. వేదపండితులు రాజేశ్‌భట్టర్‌ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. హైకోర్టు జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, పర్యాటకశాఖ మంత్రి రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు హాజరయ్యారు.

పండు వెన్నెల్లో..

ఆహ్లాదకరమైన వాతావరణంలో నిండు పున్నమి వెన్నెల కాంతుల్లో చల్లని వాతావరణం మధ్య వేదపండితులు, భక్తులు శ్రీరామనామ జపం చేస్తుండగా ఈ కల్యాణోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోదండరామస్వామి, సీతాదేవికి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో భక్తుల శ్రీరామ నామ ధ్వనుల మధ్య కల్యాణం మండపం వద్దకు తీసుకువచ్చారు. రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. వేదపండితులు విష్వక్సేన పూజ నిర్వహించారు. కర్మణ్యే.. పుణ్యాహవచనం అనే మంత్రంతో కల్యాణమండపం శుద్ధి జరిపి కల్యాణతంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానికి ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేదపండితులు కోదండరామయ్యకు ఎదురుగా సీతమ్మ వారిని కూర్చోబెట్టి కన్యావరణం నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వై భవంగా నిర్వహించారు. సు మారు 4వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలను, అన్నప్రసాదాలను అందజేశారు.

శివధనుర్భంగ అలంకారంలో రాములవారి రాజసం

బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శివధనుర్భంగ అలంకారంలో కోదండరాముడు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి గ్రామోత్సవ జరిగిం ది. స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని వి ల్లును విరిచి సీతమ్మ వారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తు చేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామి వారు భక్తులను కటాక్షించడం పరిపాటి.