News

శ్రీరామ నవమి రోజు పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో దాడులు

190views

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా లో గురువారం జరిగిన అల్లర్లు, హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కు శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హౌరాలో రెండు వర్గాల మధ్య గురువారం పెద్దఎత్తున ఘర్షణలు చేలరేగాయి. ఆందోళనకారులు వాహనాలను తగులబెడుతూ, రాళ్లు రువ్వుతూ, దుకాణాలను కొల్లగొడుతూ విధ్వంసం సృష్టించారు. పలు పోలీసు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో గవర్నర్‌ పర్యటించనున్నారు. ఇదే సమయంలో అల్లర్లకు దారితీసిన కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అమిత్‌షాకు గవర్నర్‌ ఫోనులో వివరించినట్టు తెలుస్తోంది.

రాత్రంతా సోదాలు, 36 మంది అరెస్టు
ఘర్షణలతో అట్టుడిగిన కాజిపరలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రంతా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు, సోదాలు చేపట్టారు. ఇంతవరకూ 36 మందిని అరెస్టు చేశారు. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ, షిబ్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం తాజాగా మరో హింసాత్మక ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ కోసం ఓ రోడ్డును తెరిచిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. దీనిపై బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి.