News

తిరుమలలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దివ్యదర్శన టోకెన్లు

220views

తిరుమల నడకమార్గాల్లో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజులపాటు దివ్యదర్శన టోకెన్లు ఇవ్వనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడకమార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల చొప్పున రోజుకు 15వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఈ టోకెన్లు జారీ చేస్తామన్నారు. వీటితో పాటు తిరుపతిలోనూ రోజుకు 20 వేల టైంస్లాట్‌ సర్వదదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. తిరుమలలో ఆయన ఈవో ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌15 నుంచి జూలై15వ తేదీ వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే అంచనాతో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే దిశగా వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించనున్నామన్నారు. వీఐపీలు కూడా సిఫార్సు లేఖలను తగ్గించాలని కోరుతున్నామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధమున్న క్రమంలో త్వరలో ఉప విచారణ కార్యాలయాల్లో కాపర్‌, స్టీల్‌ వాటర్‌ బాటిళ్లను కాస్ట్‌ టూ కాస్ట్‌ కింద భక్తులకు విక్రయిస్తామన్నారు.