News

హిందూ విద్యార్ధులకు బుర్ఖాలు ధరింపజేసి నృత్యాలు.. స్కూల్ సీజ్

25views

లక్నో : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూ బాలికలతో బలవంతంగా బుర్కా ధరింపజేసి, భోజ్ పూరీ పాటకు నృత్యం చేయించింది ఓ పాఠశాల.బాభన్‌జోట్ ప్రాంతంలోని ఔసానీ బుజుర్గ్‌లో వున్న పాఠశాల నిర్వాకం ఇదీ. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఎలా బుర్ఖా ధరింపజేస్తారంటూ పాఠశాల యాజమాన్యంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ ఘటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలను తనిఖీ చేశారు. తర్వాత ఆ పాఠశాలను సీజ్ చేశారు. అయితే.. ఇదే సమయంలో మరో కీలకమైన విషయం కూడా బయటపడింది. అసలు ఈ పాఠశాలకు గుర్తింపే లేదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండానే ఈ పాఠశాల నడుస్తోంది. అంతేకాకుండా వారం క్రిందటే ఈ పాఠశాలను మూసేయాలని కూడా ఆదేశాలిచ్చామని, తమ ఆదేశాలను యాజమాన్యం పెడ చెవిన పెట్టిందని అధికారులు మండిపడుతున్నారు.

మరో వైపు అసలు బుర్ఖా ధరించమని ఎవరు చెప్పారు? ఎలా ఒత్తిడి తెచ్చారు? అన్న దానిపై కూడా విద్యాశాఖ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇలా వుండగా… విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా కూడా విద్యాశాఖ తగు జాగ్రత్తలు చేపట్టింది. వారందర్నీ గుర్తింపు వున్న పాఠశాలలకు పంపిస్తోంది.