News

అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ముగింపు పత్రికాసమావేశం ప్రశ్నోత్తరాలు

47views

ప్రశ్న: వ్యవస్థలో అవినీతి, వివిధ వ్యవస్థల్లోని లోపాలపై బైఠక్‌లో ఏం చర్చ జరిగింది?

సమాధానం: ఈ అంశాన్ని కేవలం అవినీతికి మాత్రమే పరిమితం చేసి చూడలేదు. వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయడానికి ప్రభుత్వంతో పాటు సమాజంలో కూడా జాగరూకత అవసరం. NEET వంటి అంశాలు కావచ్చు లేదా ఇతర వ్యవస్థాగత సమస్యలు కావచ్చు—వాటి కారణంగా యువతలో తమ భవిష్యత్‌పై ఆందోళన ఏర్పడుతుంది. ఈ ఆందోళనను అర్థం చేసుకోవడం, దానికి పరిష్కారం చూపడం అవసరం.

కేవలం వ్యతిరేకించడం లేదా ఆటంకాలు కలిగించడం ద్వారా పరిష్కారం లభించదు. సానుకూల, నిర్మాణాత్మక దృష్టితో వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం, సమాజం—రెండూ కలిసి ప్రయత్నించాలి.

ప్రశ్న: యువతలో సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడానికి సంఘ్ ఏం చేస్తుంది?

సమాధానం: సంఘ్ కార్యం ప్రధానంగా యువత మధ్య విస్తృతంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం సుమారు 21,000 మంది యువ స్వయంసేవకులు 21 రోజుల శిక్షణ వర్గల్లో పాల్గొన్నారు. రోజువారీ శాఖల హాజరులో 60 శాతానికి పైగా యువతే ఉన్నారు.

యువతలో సంస్కారాలు, సాంస్కృతిక విలువలను కేవలం ప్రసంగాలు లేదా పోస్టర్ల ద్వారా నిర్మించలేం. వారితో నిరంతరం అనుసంధానమై ఉండటం, వారి భావాలను అర్థం చేసుకోవడం, వారితో సంభాషించడం, భారతదేశ గొప్పతనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అనుభూతి స్థాయిలో వారి ముందుంచడం అవసరం.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్ సహా అనేక సంస్థల ద్వారా యువకులు, యువతుల మధ్య పని జరుగుతోంది. నేటి యువత సామర్థ్యం, సానుకూల స్పందనను చూస్తే భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో సురక్షితంగా ఉందనే విశ్వాసం మాకు ఉంది.

దీనితో పాటు మతపరమైన, ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలు కూడా యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రశ్న: సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ ప్రతిపాదిత అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటన ఉద్దేశ్యం ఏమిటి?

సమాధానం: ఈ పర్యటన సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా విస్తృతమైన ప్రపంచ సంపర్కంలో భాగం. దీనికి మూడు ప్రధాన ఉద్దేశ్యాలు ఉన్నాయి.

మొదటిది—భారతదేశం, హిందూ సమాజం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గురించి ప్రపంచంలో వ్యాప్తిలో ఉన్న అపోహలు, దుష్ప్రచారం మధ్య వాస్తవాధారిత, సానుకూల దృష్టికోణాన్ని అందించడం.

రెండవది—భారతదేశ ఋషులు, మునులు అందించిన ‘వసుధైవ కుటుంబకం’, విశ్వ ఏకాత్మత సందేశాన్ని ప్రపంచంలోని వివిధ సమాజాలకు చేరవేయడం.

మూడవది—ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులు, భారతీయ మూలాలు కలిగిన ప్రజల ప్రయోజనాలు, హక్కుల గురించి ఆయా దేశాల్లోని ప్రధాన స్రవంతి సమాజంతో సంభాషణను పెంచడం.

ఈ క్రమంలో డా. మోహన్ భాగవత్ జీ న్యూయార్క్‌లో Universal Oneness కార్యక్రమంలో, టొరంటో మరియు లండన్‌లలో సామాజిక నాయకత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రశ్న: పంచ పరివర్తన్‌లో పర్యావరణ పరిరక్షణ విషయంలో కేవలం తీర్మానాలు లేదా సంకల్పాలకు మించి ఆచరణాత్మకంగా ఏం చేయవచ్చు?

సమాధానం: పంచ పరివర్తన్ ఆలోచనను సుమారు మూడు సంవత్సరాల క్రితం సంఘ్ శతాబ్ది సంవత్సర ప్రణాళిక రూపొందించే సమయంలో రూపొందించారు. ఏదైనా వ్యవస్థాగత పరివర్తనకు ముందు సామాజిక పరివర్తన అవసరమని మేము విశ్వసిస్తున్నాం.

పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ప్రకృతిని బయటి నుంచి రక్షించడం మాత్రమే కాదు. భారతీయ దృష్టిలో మనిషి స్వయంగా ఈ సమస్త సృష్టి, పర్యావరణంలో అంతర్భాగం.

అందువల్ల ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తమ రోజువారీ జీవితంలో కనీసం మూడు స్థాయిల్లో సహకరించవచ్చు—నీటిని వివేకవంతంగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తమ చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంచడం.

కేవలం తీర్మానాలు చేయడం వల్ల మార్పు రాదు. జీవనశైలిలో మార్పు అవసరం. ఇదే సందేశాన్ని కుటుంబాలు, గ్రామాలు, దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. వ్యక్తి, కుటుంబం ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పు కూడా విస్తృతమైన సామాజిక, పర్యావరణ పరివర్తనకు ఆధారం కాగలదు.

ప్రెస్ మీట్ లో పాల్గొన్నవారు
శ్రీ ముకుంద్ జీ — అఖిల భారతీయ సహ సర్‌కార్యవాహ్
శ్రీ సునీల్ ఆంబేకర్ జీ — అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్
శ్రీ నరేంద్ర జీ — అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్
శ్రీ ప్రదీప్ జోషి జీ — అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్
శ్రీ ఆయుష్ జీ — దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్
శ్రీ బయ్యా వాసు జీ — ప్రాంత ప్రచార ప్రముఖ్, ఆంధ్రప్రదేశ్
శ్రీ వాసుదేవ రావు జీ — ప్రాంత సహ ప్రచార ప్రముఖ్, ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నారు.