
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ భారత్‌లో భాగమని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు. తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన ఆయన శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ భారత్‌లో భాగమని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఓ అమెరికా రాయబారి పర్యటించడం ఇదే తొలిసారి. సెర్గియో గోర్ ప్రస్తుతం భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా కాశ్మీర్‌తో పాటు లడఖ్‌లోనూ పర్యటించనున్నారు.
ఒమర్ అబ్దుల్లాతో కీలక భేటీ
శ్రీనగర్ చేరుకున్న అనంతరం సెర్గియో గోర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ ప్రాధాన్యతలు, అభివృద్ధి, ఆర్థిక సహకారం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ భేటీ అనంతరం గోర్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఎంతో అందమైన ప్రాంతమని, ఇక్కడ పర్యాటక అవకాశాలను మరింత పెంచే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అమెరికా ప్రయాణ హెచ్చరికలను కూడా పునఃపరిశీలించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. భద్రతా పరిస్థితులు మెరుగుపడితే అమెరికా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.
‘కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం ఢిల్లీ నుంచే’
మరోవైపు, అమెరికా రాయబారితో భేటీకి ముందే ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలను అమెరికా రాయబారి వద్ద ఫిర్యాదుల రూపంలో ప్రస్తావించబోనని స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం వాషింగ్టన్ నుంచి రాదని, భారత కేంద్ర ప్రభుత్వమే వాటికి పరిష్కారం చూపాల్సి ఉంటుందని అన్నారు.




