News

ఈ ఏడాది లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

77views

దేశంలోని లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మేరకు అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పేర్కొంది. ఈ సందర్బంగా విజయవాడలోని ఆర్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీస్‌ హైందవి భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అఖిల భారతీయ ప్రతినిధి సభలో చర్చకు వచ్చిన పలు అంశాలు, లక్ష్యాలను ప్రాంత సహ సంఘచాలకులు శ్రీ సుంకపల్లి రామకృష్ణజీ, ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీ బయ్యా వాసుజీ వివరించారు. తొలుత రామకృష్ణజీ మాట్లాడుతూ.. అఖిల భారతీయ ప్రతినిధుల సభ ఈ నెల 12, 13, 14 తేదీల్లో హరియాణలోని పానిపట్‌ వద్ద నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి 2025 నాటికి శతాబ్దం కావస్తోన్న తరుణంలో రానున్న కాలంలో అనేక లక్ష్యాలను చేరుకోవడంతోపాటు.. ప్రధానంగా భారతదేశ పునరుజ్జీవనాన్ని సంఘ్‌ కోరుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో సంఘ్‌ ముందుంటూ.. అన్ని వర్గాల ప్రజలకీ చేరువ కావాలని భావిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను పెద్దఎత్తున విస్తరించేందుకు కార్యకర్తలతోపాటు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సర్వ వ్యాపి.. సర్వ స్పర్శి లక్ష్యంతో ముందుకు..
రానున్న రోజుల్లో సర్వ వ్యాపి.. సర్వ స్పర్శి లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు చేపట్టాలని ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా వాసుజీ పిలుపునిచ్చారు. ఇందులో సర్వ వ్యాపి అంటే.. అన్ని గ్రామాలకు, ప్రాంతాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. సర్వ స్పర్శి ద్వారా సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలను దగ్గరకు తీసుకుంటూ.. ఆప్యాయంగా దగ్గర కావాలని సూచించారు. ఈ దేశాన్ని విశ్వగురువు స్థాయికి తీసుకెళ్లాలని వాసుజీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాఖ సభ్యులు నిత్య శాఖ, సాప్తాహిక్‌, సంఘ మండలిలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా యువత కోసం గత ఏడాది నిర్వహించిన రెసిడెన్షియల్‌ క్యాంప్‌లో సుమారు 3549 మంది పాల్గొన్నారని.. ఈ ఏడాది ఆ సంఖ్యను 6 వేలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

వచ్చే ఏడాదికి రెండు లక్షల మంది స్వయం సేవకులు..
ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌లో ప్రస్తుతం లక్షా యాభై వేల మంది స్వయం సేవకులు ఉన్నారని.. వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను రెండు లక్షలకు చేయాలని నిర్ణయించుకున్నట్లు బయ్యా వాసుజీ పేర్కొన్నారు. దీంతోపాటు కుటుంబ ప్రబోధన్‌ అనగా.. కుటుంబాలను బలోపేతం చేసే విధంగా, భారతదేశం వసుధైక కుటుంబం అని అందరికీ తెలియ చేయడమే తమ ముందున్న కర్తవ్యం అని పేర్కొన్నారు. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణ, స్వ విధానం.. అనగా స్వదేశీతనం, మాతృభాషను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హానికర ప్లాస్టిక్‌ నిషేధానికి సంఘం కట్టుబడి ఉందన్నారు. సేవా బస్తీల్లో ప్రస్తుతం సుమారు 750 ట్యూషన్‌ సెంటర్లను నడుపుతున్నామని.. రానున్న ఏడాదికి వాటిని 1500 వందల వరకు విస్తరించనున్నట్లు వివరించారు. రాబోయే ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను చేరుకుంటామని ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా వాసుజీ తెలిపారు.