News

రైల్వే శాఖ ఆధ్వర్యంలో ‘శ్రీరామాయణ యాత్ర’

86views

భారత్‌ గౌరవ్‌ డీలక్స్‌ ఏసీ పర్యాటక రైలు ద్వారా 18 రోజుల ‘శ్రీరామాయణ యాత్ర’ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పుణ్యక్షేత్రాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ‘‘ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ స్టేషన్‌ నుంచి వచ్చే నెల 7న రైలు ప్రారంభమవుతుంది. అనంతరం శ్రీరాముడి జీవితంలో ముఖ్యఘట్టాలు జరిగిన ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకూ దేశంలో 26 భారత్‌ గౌరవ్‌ ఏసీ పర్యాటక రైళ్లు నడుస్తున్నాయి. తాజా యాత్రకు ఆ రైలునే కేటాయించనున్నాం. రైలు తొలి గమ్యం అయోధ్య. అక్కడి శ్రీరామజన్మభూమి ఆలయం, హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. బిహార్‌లోని సీతామర్హి, వారాణసీ, ప్రయాగరాజ్‌, చిత్రకూట్‌, నాసిక్‌, పంచవటి, కర్ణాటకలోని హంపి, తెలంగాణలోని భద్రాచలం వంటి పలు ప్రాంతాలు ఈ పర్యాటక యాత్రలో భాగంగా ఉండనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రైలు వెనక్కి బయలుదేరుతుంది. యాత్రికులు మొత్తం 7500 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. సెకండ్‌ ఏసీలో ఒక్కొక్కరికీ రూ. 1.14లక్షలు, ఫస్ట్‌ ఏసీలో 1.46 లక్షలు, ఏసీ కూపేకు రూ. 1.68లక్షల మేర ఖర్చవుతుంది’’ అని అధికారులు తెలిపారు.