News

ఆలయ విధ్వంసాలపై మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని హామీ

269views

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల ధ్వంసం గురించి మోదీ ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయులకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు మోదీ మాట్లాడుతూ..ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులకు సంబంధించిన నివేదికలు చూశాను.

దీని గురించి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు తెలియజేశాను. ఆయన ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రత, శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా, ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాన్ని భారత్‌ పదేపదే ఖండించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ సమస్యను లేవనెత్తింది. గత వారం, బ్రిస్బేన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. ఆస్ట్రేలియాలో గత రెండు నెలల్లో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాల్లో ఇది నాలుగో ఘటన.