News

అస్సలాము అలైకుమ్, ఇన్‌షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS..

4views

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి బుష్రా బానోపై హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు దాఖలైంది. అధికారిక వీడియో ప్రకటనలో ఆమె మతపరమైన అభివాదాలు, వ్యాఖ్యలను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ లీగల్ ఫండ్ ఈ ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో బుష్రా బానో తన వీడియోను “’అస్సలాము అలైకుమ్” అంటూ ప్రారంభించారని, ప్రసంగంలో “ఇన్‌షా అల్లా” అనే పదాన్ని ఉపయోగించారని, చివర్లో “జజాకల్లాహ్” అంటూ ముగించారని పేర్కొన్నారు. పోలీసు యూనిఫామ్‌లో అధికారిక హోదాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో మతపరమైన అభివాదాలు, పదాలను ఉపయోగించడం సముచితమేనా అని ఫిర్యాదుదారు ప్రశ్నించారు.

ఓ న్యూస్‌ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా.. బుష్రా బానో పోలీసు యూనిఫామ్‌లో కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల అధికారిక ప్రకటనలు మతతటస్థంగా ఉండాలనే అభిప్రాయాన్ని ఫిర్యాదుదారు వ్యక్తపరిచారు. అలాగే “వందేమాతరం” లేదా “జై హింద్” వంటి అభివాదాలను ఉపయోగించలేదని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై తగిన పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ హోంశాఖను ఫిర్యాదుదారు కోరారు. అయితే ఫిర్యాదు దాఖలైనంత మాత్రాన అధికారిణి తప్పు చేసినట్లు నిర్ధారణ కాదని, ఆరోపణల్లో వాస్తవాలను సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఎవరీ బుష్రా బానో?
బుష్రా బానో 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాకు చెందిన ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీతో పాటు నెట్-జేఆర్‌ఎఫ్ కూడా సాధించారు. సివిల్ సర్వీసెస్‌లోకి రాకముందు ఆమె వివిధ రంగాల్లో పనిచేశారు. సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేసిన ఆమె.. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆమె నిర్ణయానికి భర్త కూడా మద్దతుగా నిలిచి, పిల్లలతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చారు.