News

16 వేల మొక్కలతో గణనాథుడు

3views

అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చింతామణి గణపతి ఆలయంలో 21వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా 16 వేల మొక్కలతో వినూత్నంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన గవర్నర్‌కు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు.

అనంతరం గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొణతాల రామకృష్ణ అధ్యక్షతన రూపొందించిన ఈ సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు.

అనంతరం గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. సస్య గణపతి పర్యావరణ పరిరక్షణపై చక్కటి సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా ఒక మొక్క నాటి పరిరక్షించాలని, కాలుష్య నివారణకు విద్యుత్ వాహనాలను వినియోగించాలని పిలుపునిచ్చారు.