
అనంతపురం జిల్లా యాడికి పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ, వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చి.. తేరుగూడు వద్ద నుంచి కెనరా బ్యాంక్ వరకు మడుగు తేరు లాగారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పురవీధుల గుండా రథాన్ని లాగుతూ తేరు మిద్దెలోనికి రథాన్ని చేర్చారు. రథోత్సవంలో గోవిందనామ స్మరణతో వీధులు మారుమోగాయి. వేడుకలలో ఈఓ దుర్గాప్రసాద్, ఎంపీపీ ఉమాదేవి, సర్పంచ అనురాధ, ఉప సర్పంచ చంద్రమోహన, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.





