News

గరుడ వాహనంపై వైకుంఠవాసుడి వైభవం

261views

కదిరి వైకుంఠ వాసుడైన శ్రీమత ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై విహరిస్తూ.. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మగరుడసేవ మంగళవారం వైభవంగా సాగింది. యాగశాలలో శ్రీవారికి ఉదయం నిత్య పూజలు చేశారు. అనంతరం తిరువీధుల్లో స్వామివారు విహరించారు. సంధ్యాసమయంలో శ్రీవారు గరుడవాహనంపై ఆశీనులై, తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు గరుడ పూజ వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మగరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారిని తూర్పురాజగోపురం కింద దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో భారీగా భక్తులు తరలివచ్చి, శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఉత్సవానికి ముందుభాగంలో వివిధ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కదిరి పున్నమి రోజున శ్రీవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు (స్వామికాపులు) తరలివచ్చారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకుని, స్వామిని దర్శించుకున్నారు. కర్ణాటక, హిందూపురం, మదనపల్లి, తిరుపతి, రాయచోటి, పులివెందుల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.