News

పాకిస్థాన్‌కు 700 మిలియన్‌ డాలర్లు అప్పు ఇవ్వనున్న చైనా.. ఎందుకోసం అంటే?

138views

చైనా దేశం భారత్‌ను ఏవిధంగానైనా దెబ్బకొట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. దీంతోపాటు మన శత్రు దేశాలకు సాయం అందిస్తూ.. భారత్‌ను రెచ్చగొడుతోంది. ఈక్రమంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ కు సుమారు 700 మిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు చైనా అభివృద్ధి బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపడం ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని నేరుగా పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం తెలిపారు. ఈక్రమంలో భారత దేశానికి పొరుగున ఉన్న పాకిస్థాన్, శ్రీలంకలకు చైనా రుణాలిస్తుండటం పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రుణాలిచ్చి, ఆ దేశాలను తన స్వప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ త్వరలో భారత్‌లో పర్యటించబోతున్న తరుణంలో అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాలను మీడియాకు చెప్పారు.

అమెరికన్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (దక్షిణ, మధ్య ఆసియా) డొనాల్డ్ లు విలేకర్లతో మాట్లాడుతూ.. భారత దేశానికి పొరుగున ఉన్న దేశాలకు చైనా రుణాలిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రుణాలను చైనా తన స్వీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉందని తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామన్నారు. తాము భారత దేశంతోనూ, ఆ ప్రాంతంలోని దేశాలతో చర్చిస్తున్నామని, బయటివారి నిర్బంధానికి గురికాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నామని తెలిపారు. చైనాతో సహా బయటి శక్తుల ప్రభావం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా దేశాలకు తాము ఏ విధంగా సాయపడగలమో చర్చిస్తున్నామని చెప్పారు.

చైనా గురించి భారత్-అమెరికా మధ్య విస్తృత చర్చలు జరుగుతున్నాయన్నారు. నిఘా బుడగ కూల్చివేతకు ముందు, తర్వాత కూడా మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. ఈ చర్చలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి క్వాడ్ సైనిక కూటమి కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకం కాదన్నారు. స్వేచ్ఛాయుతమైన, అరమరికలు లేని ఇండో-పసిఫిక్‌కు మద్దతుగా నిలిచే కార్యకలాపాలను, విలువలను ప్రోత్సహిస్తుందని చెప్పారు.