News

లైంగిక వాంచ కోసం క్షిపణి పరీక్షల సమాచారాన్ని పాక్‌కు పంపిన డీఆర్డీడీవో అధికారి

292views

పాకిస్థాన్‌కు మన దేశంలోని రక్షణ దళాలతోపాటు, ఇతర రక్షణ రంగ పరిశోధన సంస్థల నుంచి కీలకమైన వివరాలు విదేశాలకు వెళ్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం.. అయితే తాజాగా డీఆర్‌డీఏ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి.. తన లైంగిక వాంచ కోసం కీలకమైన సమాచారాన్ని చేరవేసిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాలా విలువైన సమాచారాన్ని పాకిస్థానీ గూఢచారికి అతను అందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలో అతనిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఒడిశాలోని ఈస్టర్న్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిమాంశు కుమార్ లాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, చాందీపూర్‌లో ఉన్న డీఆర్‌డీవో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో పని చేస్తున్న 57 ఏళ్ళ ఓ ఉన్నతాధికారి మన దేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఓ పాకిస్థానీ గూఢచారికి అందించారని తెలిపారు. క్షిపణి పరీక్షలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంపించారన్నారు. పాకిస్థానీ గూఢచారికి చేరిన సమాచారం వివరాలు దర్యాప్తులో స్పష్టమవుతాయన్నారు. చాందీపూర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు ఆ డీఆర్‌డీవో ఉన్నతాధికారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన అధికారిపై ఐపీసీ సెక్షన్లు 120ఏ, 120బీ, అధికార రహస్యాల చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆ డీఆర్‌డీవో అధికారి సెక్స్, ఆర్థిక ప్రయోజనాల కోసం రక్షణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్థానీ గూఢచారికి అందించినట్లు ఫిర్యాదులో ఆరోపించారని తెలిపారు. ఆయన ఫోన్‌ను తనిఖీ చేసినపుడు వాట్సాప్ చాట్స్‌లో లైంగికంగా ప్రేరేపించే ఫొటోలు, వీడియోలు కనిపించాయని చెప్పారు. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఐటీఆర్-చాందీపూర్‌లో గూఢచర్యం సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 2021 సెప్టెంబరులో అయిదుగురు కాంట్రాక్టు సిబ్బందిని ఈ ఆరోపణలపై అరెస్టు చేశారు. 2015లో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు.

చాందీపూర్‌లో రెండు డీఆర్‌డీఓ టెస్ట్ రేంజెస్ ఉన్నాయి. ఇవి ఐటీఆర్, పీఎక్స్ఈ. వీటిలో క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తూ ఉంటారు.