News

ప్రపంచానికి భారత్‌ దిక్సూచి – రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

206views

ప్రపంచానికి భారత్‌ దిక్సూచి అవుతోందని, ప్రస్తుతం ఆ దిశగా అభివృద్ధి సాధిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. భారత్‌ కేవలం శక్తివంతంగా ఎదగడమే కాకుండా ఇతరుల ప్రగతికి చేయూత ఇస్తోందన్నారు. ఎయిర్‌షో ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక అంటూనే ఆధ్యాత్మిక, ధైర్య సాహసాలకు నెలవైనదని అటువంటి చారిత్రాత్మక గడ్డపై ఎయిర్‌షో కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యాననగరి బెంగళూరు(Bangalore)లో సాగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలు ప్రతి విడత ఓ కొత్తదనం, ప్రజాభిమానం పొందుతున్నాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రదర్శనలు గతంలోని అన్ని రికార్డులను తిరగరాసి అతి పెద్ద షో కానుందని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి విధానం, వ్యక్తిత్వం, భారత సమగ్రత, సమైక్యతకు నిదర్శనమన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలకు ఫలితాలు వేగవంతంగా ఉంటున్నాయన్నారు. ఎయిర్‌ షో పారిశ్రామికీకరణ, సాంకేతిక ప్రదర్శనలకు వేదిక కానుందని చెప్పారు. యువతకు భిన్నమైన రంగాల్లో అవకాశాలు కల్పించినట్టు అయిందన్నారు. ప్రదర్శనలో ఎత్తు, వేగం అనే రెండు ప్రముఖ అంశాలను దృష్టిలో ఉంచుకున్నామన్నారు. భారత్‌ స్వశక్తితో ముందుకెళుతోందని, మనదేశం సధృడంగా ఉందన్నారు. ఏరో ఇండియా ప్రదర్శనలకు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించామన్నారు. తుమకూరు, లఖ్‌నవ్‌, బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని స్వయంగా ఆహ్వానించామన్నారు. రక్షణ, వైమానిక రంగానికి సంబంధించిన దేశంలో మూడు ప్రత్యేక కార్యక్రమాలు జరగ్గా అందులో కర్ణాటకలోనే రెండు ఉండడం గమనించాల్సిన విషయమన్నారు.