News

దుర్గగుడి బస్సుల్లో ఉచిత ప్రయాణం.. టికెట్ల రద్దు కోసం ప్రతిపాదన!

77views

విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, దుర్గాఘాట్‌ నుంచి ఇంద్రకీలాద్రి పైకి దేవస్థానం నడుపుతున్న బస్సుల్లో వసూలు చేస్తున్న నామమాత్రపు చార్జీని సైతం రద్దు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్‌కు ఆలయ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు..
దుర్గగుడికి మొత్తం తొమ్మిది బస్సులు ఉన్నాయి. వాటిలో నాలుగు బస్సులను రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి దుర్గగుడి పైకి నడుపుతున్నారు. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌ నుంచి కొండ పైకి నడుపుతున్నారు. రెండు బస్సులను స్టాండ్‌ బైలో ఉంచి పండుగలు, పర్వదినాలు, రద్దీ సమయాల్లో వినియోగిస్తున్నారు. రోజూ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వేస్టేషన్, బస్టాండ్‌–దుర్గగుడి మధ్య బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో 16 సార్లు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో 20 సార్లు బస్సులు తిరుగుతాయి. దుర్గాఘాట్‌ నుంచి కూడా అదే స్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతారు. నిత్యం 30వేల నుంచి 40 వేల మంది, శుక్ర, ఆదివారాల్లో 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీరిలో సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల మంది, శుక్రవారం, ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో 7 వేల నుంచి 10 వేల మంది వరకు దేవస్థానం బస్సుల్లో ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గాఘాట్‌ నుంచి కేవలం రూ.10 మాత్రమే టికెట్‌ వసూలు చేస్తారు. దీంతో దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఆయిల్, రిపేర్లు, జీతాలు ఇతర ఖర్చులు మినహాయించినా రూ. కోటి మేరకు నికర ఆదాయం వస్తుంది.

భక్తులకు ఆర్థికంగా ఉపశమనం..
కరోనాకు ముందు రెండు బస్సుల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. కరోనా తర్వాత దానిని రద్దు చేశారు. తాజాగా మొత్తం ఏడు బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వచ్చే భక్తులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు.