News

భారత్‌ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది – సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ

171views

మైసూరు (VSK) – భారతదేశం అంతటా సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని.. ఎంతో ప్రతిభావంతులైన మనదేశ యువకులు అనేక రంగాల్లో ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. రానున్న 25 ఏళ్లలో భారతదేశ అభివృద్ది యువత చేతుల్లోనే ఉంటుందని సర్‌కార్యవాహ జీ విద్యార్థులకు తెలిపారు.

భారతదేశంలోని ప్రజలు అనేక దశాబ్దాలుగా అంతర్గత ఘర్షణలు, విధానపరమైన సమస్యలు, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, ఇతర ఇబ్బందులతో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేదని.. మాకు సాయం చేయమని చాలా దేశాల ముందు వేడుకోవలసి వచ్చేదని.. కానీ నేడు ఆ పరిస్థితులు ఎక్కడా లేవని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ స్పష్టం చేశారు.

అదృష్టవశాత్తూ ఆ ఇబ్బందులు ఇప్పుడు లేవని.. నేడు మన దేశం ఆహార ఉత్పత్తి, విద్యుదీకరణ, శక్తి, భద్రత తదితర మౌలిక సదుపాయాలను కూడగట్టుకుని మునుపెన్నడూ లేని వేగంతో స్వావలంబన సాధించిందన్నారు. మైసూర్‌ పరిధిలోని శ్రీ శివరాత్రీశ్వర నగర్‌లోని జేఎస్‌ఎస్ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జేఎస్‌ఎస్ ఏహెచ్‌ఈఆర్) 13వ స్నాతకోత్సవ కార్యక్రంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుత్తూరు మఠాధిపతి శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామీజీ కూడా పాల్గొన్నారు.

“భారత దేశం ఇప్పుడు చారిత్రాత్మక ప్రగతిని సాధిస్తోంది. భారత్ మేల్కొంటోంది, ప్రజలు కూడా సూప్తావస్తను వీడారు. ఈ ప్రాచీన నాగరికత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.. కానీ అది అంతం కాలేదు. సామాజిక అసమానత, కులతత్వం, సామాజిక కలహాలు, కాలం చెల్లిన ఆచారాలు మొదలైన కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అక్కడక్కడా ఉన్నాయని ” సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ పేర్కొన్నారు. భారతదేశం మళ్లీ పుంజుకోవడానికి అంతర్గత బలం ఉందని.. కానీ పాశ్చాత్య సంస్కృతిపై ప్రజలకు ప్రేమ మొదలైందని తెలిపారు. ఆయా దేశాల్లోని వస్తువులపై ఇష్టం పెంచుకోవడం వంటి ఆధునిక రుగ్మతలతో భారతదేశం చిక్కుకుందన్నారు. సమాజాన్ని వీటి నుంచి విముక్తి చేయాలన్నారు.

ఏడు దశాబ్దాల క్రితమే విదేశీ పాలకులు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పటికీ, విద్యావంతులలోని విస్తారమైన వర్గం మానసిక బానిసత్వంలో కొనసాగుతోందన్నారు. “యూరో సెంట్రిక్ ఆలోచనలు, వ్యవస్థలు మరియు అభ్యాసాలు, పాశ్చాత్య ప్రపంచ దృష్టికోణం ఇప్పటికీ దశాబ్దాలుగా మనల్ని శాసిస్తున్నాయని… రక్తంలో, రంగులో భారతీయులే అయినా… రుచిలో, అభిప్రాయంలో, నీతిలో, తెలివిలో ఇంగ్లీషులో ఉన్న ఒక వర్గాన్ని సృష్టించాలన్న థామస్ మెకాలే కోరిక దాదాపు నెరవేరిందని సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ అన్నారు. “విద్య, న్యాయవ్యవస్థ, పరిపాలన, సంస్థలు, కళ మరియు సాంస్కృతిక రంగాలలో మరియు మీడియాలో కీలకమైన పదవులను నిర్వహించిన కొందరు వ్యక్తులు భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి వారిని ఎదుర్కోవాలంటే.. అణచివేయబడిన భారత్ యొక్క ఆత్మ ఉచ్చారణ గురించి అందరూ తెలుసుకోవాలని దత్తాత్రేయ హోసబాలే జీ స్పష్టం చేశారు.

“భారతదేశాన్ని చెడుగా చూపించడానికి, దాని చరిత్రను వక్రీకరించడానికి, సంస్కృతీ సంప్రదాయాలను కించపరచడానికి, విలువలను కించపరిచేందుకు కొంతమంది స్వార్థపూరితమైన పన్నాగం అమలు చేస్తున్నారన్నారు. ఈ విధానం మారాలని పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడం ద్వారా బలమైన మరియు సుసంపన్నమైన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ లక్ష్యం కోసం యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌ఎస్‌ అహీర్‌ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సురీందర్ సింగ్, ప్రో-ఛాన్సలర్ డాక్టర్ బి. సురేష్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ సి.జి. బెత్సూర్మఠ్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.మంజునాథ తదితరులు పాల్గొన్నారు.

source  – vsk bharath