News

కడపలో విజయదుర్గాదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

246views

కడప నగరంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి ఆలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యాగ మండపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ నిర్వాహకులు దురా ప్రసాద్‌ దంపతులు గణపతిపూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవ పూర్వాంగ కార్యక్రమాలతో అంకురార్పణ చేయగా.. ప్రముఖ పండితులు రాయపెద్ది సుబ్బరాయశర్మ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అయితే… ప్రస్తుతం జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 4వ తేదీ శనివారం నుంచి 7వ తేదీ మంగళవారం వరకు రోజూ అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే యాగ మండపంలో గణపతి చండీహోమాలు, ఆలయ మండపంలో శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. కాగా… విజయదుర్గాదేవి 7వ తేదీ మాఘ విధియ రోజున కడపలో వెలసిన పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి విశేష అభిషేకం, చండీహోమం, శ్రీచక్రార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తదుపరి అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి విజయదుర్గాదేవి-మల్లికార్జునస్వాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. భక్తులు ఈ బ్రహ్మోత్సవాలను తిలకించి అమ్మవారి కరుణకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు కోరారు.