
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మూలపాడు దాసాంజనేయస్వామి దూప దీప నైవేద్యం నిమిత్తం అమరావతి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దానం చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దాసాంజనేయస్వామి దేవస్థానం పోషణ నిమిత్తం ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌లో సర్వే నెంబరు 2/1, 2/2లో 6.66 ఎకరాలు నమోదై ఉంది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి అని, వేలంపాట నిర్వహించి ఏటా కౌలుకు ఇస్తున్నారు. అయితే…. ఇదే గ్రామానికి చెందిన ఆళ్ల రాములు అనే వ్యక్తి 1995వ సంవత్సరంలో ఆలయ పూజారులు కపిలవాయి భవాని శంకరశాస్త్రి నుంచి దేవాలయానికి చెందిన కొంత భూమిని కోనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు రాయించుకుని నివాసం ఏర్పరుచుకున్నారు. అనేక మార్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎండోమెంట్, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. తిరిగి ఇటీవల దేవాలయ భూమిలో నూతనంగా ఇల్లు నిర్మించటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ భూమిని పూజారులు ఏ విధంగా రాసి ఇస్తారని, వారికి అటువంటి హక్కులు ఉండవని, దాసాంజనేయ భూమిగా నమోదై ఉన్న భూమి విక్రయించే వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 సెంట్లకుపైగా ఆళ్ల రాములు కుమారుడు ఆళ్ల ముత్తారావు ఆక్రమించిని భూమిని స్వాధీనం చేసుకున్నా రెవెన్యూ, ఎండోమెంట్, పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. దీనికి గ్రామంలోనే కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాలయ భూమికి రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినపుడు కూడా కబ్జాకు గురైందని గుర్తించారు. మామూళ్ల మత్తులో మునిగిపోయిన పంచాయతీ అధికారులు ఇంటి పన్నులు వేశారని తెలుస్తోంది. అధికారులు కబ్జా కోరల నుంచి విముక్తి కలిగించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
దాసాంజనేయస్వామి భూమి కబ్జాకు గురైన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కబ్జాదారులకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసులు తరువాత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వీఆర్‌వో నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి రాణి తెలిపారు.





