
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 12న భృంగివాహనసేవ, 13న హంసవాహనసేవ, 14న మయూరవాహన సేవ, 15న రావణ వాహన సేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజవాహనసేవ, 18న నందివాహనసేవ… అదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, 12 గంటలకు స్వామి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 19న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, ధ్వజావరోహణ కార్యక్రమాలు, 21న అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష..
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సూచించారు. ఈమేరకు మంగళవారం దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్, పార్కింగ్, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం, సున్నిపెంటలోని వైద్యశాలల్లో 24 గంటలు సేవలందించేలా వైద్యులను నియమించాలని.. రద్దీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్ర మార్గంలో ఒక అంబులెన్సు ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ నుంచి 650 బస్సులు
ఏపీలోని వివిధ జిల్లాల నుంచి 650 బస్సులు, తెలంగాణ నుంచి 180 ప్రత్యేక బస్సు సర్వీసులను శ్రీశైలానికి నడపాలని అధికారులు భావిస్తున్నారు. భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా.. ప్రకాశం, నాగర్ కర్నూల్ జిల్లాలలో విస్తృత ప్రచారం చేయాలని రవాణా శాఖ అధికారులను, ట్రాఫిక్ డీఎస్పీలను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించినట్లు చెప్పారు. ఉత్సవాలకు ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ కెమెరాలతో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్ సమస్య తలెత్తకుండా అదనంగా టవర్లను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించాలన్నారు. అన్ని జోన్లకు నిరంతరం విద్యుత్తు ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.
సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు: ఈవో
స్వామి, అమ్మవార్ల దర్శనం సులభంగా చేసుకునేందుకు భక్తులకు నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వీఐపీల ప్రొటోకాల్‌తో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. : ఎస్పీ
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలు నిలిచే అవకాశం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామని, పోలీస్ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని కోరారు.





