News

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్‌ విలవిల

415views

విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా… ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్‌ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటికే 46 మంది చనిపోయారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. మరో 150 మంది గాయపడినట్లు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి సంభవించింది. ప్రార్థనల కోసం ముందు వరుసలో ఉన్న ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకున్నాడని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి మసీదు భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రెస్క్యూటీమ్ ఆసుపత్రికి తరలించింది. పెషావర్‌లోని ప్రధాన ఆసుపత్రిలో ఎటు చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం అలుముకుంది.

పాక్ ప్రభుత్వం ఇటీవలే పెట్రో ధరలు అనూహ్యంగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు ఒక్కసారిగా 35 రూపాయలు పెంచేసింది. అదే సమయంలో కిరోసిన్, లైట్ డీజిల్ ఆయిల్ లీటర్‌కు 18 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 249, లీటర్ డీజిల్ ధర 262 రూపాయలకు పెరిగింది. లీటర్ కిరోసిన్ ధర 189, లీటర్ లైట్ డీజిల్ ధర 187కు పెరిగింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు పెట్రో ధరలు పెంచినట్లు డాన్ పత్రిక కథనం వెలువరించింది.

ఇక పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితి నుంచి అత్యంత దీనావస్థకు చేరుకుంటున్న సమయంలో ఆ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సహాయక బృందాలను పంపించేందుకు నిరాకరించింది. సమీక్షను పూర్తి చేయడానికి సహాయక బృందాన్ని పంపించాలని పాకిస్థాన్ విన్నవించినప్పటికీ ఐఎంఎఫ్ కనికరించలేదు.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సహాయపడుతుందని చాలా మంది ఊహించారు. కానీ ఆ దేశ వినతిని ఐఎంఎఫ్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్‌ ‌ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయికి అంటే 4.343 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఆ దేశానికి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు ఈ సొమ్ము కేవలం రెండు వారాల వరకు మాత్రమే సరిపోతుంది. ముఖ్యంగా చమురును దిగుమతి చేసుకోవడానికి ఈ సొమ్మును వెచ్చించవలసి ఉంటుంది.

పాక్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాలకు.. విద్యుత్‌ సంక్షోభం కూడా తోడైంది. ఇస్లామాబాద్‌, కరాచీ, లాహోర్‌, పెషావర్‌ తదితర అన్ని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. కరెంటు రాకపోవడంతో విద్యుత్‌ ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలతో పాటు ఇళ్లల్లో ఉండే సామాన్య ప్రజలు కూడా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాకిస్థాన్‌కు 2019లో 6 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒక బిలియన్ డాలర్లు వచ్చింది. ఈ సొమ్ము సరిపోకపోవడంతో తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్‌తోపాటు మరికొన్ని దేశాలను పాకిస్థాన్ (Pakistan) ఆశ్రయించింది.

మరోవైపు గ్యాస్ ధరలు ఇటీవలే 70 శాతం, విద్యుత్తు ఛార్జీలు 30 శాతం చొప్పున పెరిగాయి. ప్రధాన ఆహారమైన గోధుమ పిండి కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. అదే విధంగా మంత్రిత్వ శాఖల ఖర్చుల్లో 15 శాతం తగ్గించుకోవడంపై పరిశీలిస్తోంది. ఫెడరల్ మంత్రుల సంఖ్యను కూడా తగ్గించాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.