News

‘‘నేను హిందువును’’ అని చెప్పుకునే స్వేచ్ఛ కేరళలో లోపిస్తోంది – కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

410views

‘‘ నేను హిందువును ’’ అని చెప్పుకోవడం తప్పు అని… ఆ భావనలు కలిగించేలా కేరళ రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను విశాల దృక్పథంతో ఆమోదించారని ఆయన అన్నారు. ప్రస్తుతం కొందరు హిందూ మతాన్ని గౌరవించని పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఉత్తర అమెరికాలోని కేరళ హిందువుల ఆధ్వర్యంలో తిరువనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్ మాట్లాడారు.

భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే..

భారత దేశంలో పుట్టి, ఇక్కడ పండిన ఆహారాన్ని తిని, జీవించేవారంతా హిందువులేనని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. స్వాతంత్య్రానికి పూర్వం సనాతన ధర్మాన్ని విశ్వసించే రాజులు, పాలకులు అన్ని మతాలను ఆమోదించారని తెలిపారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు, సంస్కరణవాది, విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గతంలో ఆర్య సమాజ్ సమావేశంలో మాట్లాడారని గవర్నర్ గుర్తు చేశారు. భారత దేశంలో పుట్టినవారెవరైనా, భారత దేశంలో పండిన ఆహారంపై జీవించేవారెవరైనా, భారత దేశంలోని నదుల నీటిని తాగేవారెవరైనా తనను తాను హిందువుగా చెప్పుకోవడానికి అర్హుడవుతారని సర్ సయ్యద్ చెప్పారని తెలిపారు. తనను హిందువుగా పరిగణించాలని సర్ సయ్యద్ కోరినట్లు తెలిపారు. ‘‘మీరు నన్ను ఓ హిందువు అని తప్పనిసరిగా పిలవాలి’’ అని కోరారన్నారు. ‘‘మీ (ఆర్య సమాజ్ సభ్యులు) మీద నాకు ఉన్న తీవ్రమైన ఫిర్యాదు ఏమిటంటే, నన్ను ఓ హిందువుగా ఎందుకు పరిగణించరు? హిందువు అనేది మతపరమైన పదం అని నేను భావించను. హిందూ అనేది భౌగోళిక పదం’’ అని సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారని గవర్నర్ ఆరిఫ్ తెలిపారు. వలస పాలన కాలంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా సర్ సయ్యద్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆర్య సమాజ్ సభ్యులు ఆయనకు విందు ఇచ్చారని గవర్నర్ తెలిపారు. బ్రిటిషర్లు ప్రజల సాధారణ హక్కులను నిర్ణయించేందుకు ప్రాతిపదికగా మతాలను వాడుకున్నారని గవర్నర్ తెలిపారు. అటువంటి సమయంలో హిందూ, ముస్లిం, సిక్కు వంటి పదాలను వాడటం కచ్చితంగా బాగుంటుందని చెప్పారు.