News

రథసప్తమి రోజు ఇవి చేస్తే చాలా మంచిది!

115views

ఏటా రథసప్తమిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. మాఘసుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమి భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మానవుల జీవితంపై సూర్య భగవానుడి ప్రభావం ఎంతో ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడి కరుణ మనపై పుష్కలంగా ఉంటేనే ఎటువంటి అనారోగ్యాలు ధరిచేరకుండా ఆరోగ్యంగా జీవించగలం అని అంటుంటారు. ఇక ఇదే రోజున తమ ఏడు గుర్రాల రథంతో భూలోకానికి వస్తూ.. దేదీప్యమానంగా వెలుగుతూ అత్యంత కాంతివంతంగా సూర్యభగవానుడు కనిపిస్తాడు.

ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల సకల సంపదలు, ఆరోగ్యం, సంతోషం చేకూరతాయి. ప్రత్యేక స్నానం అందులోనూ నదీ స్నానం ఆచరించడం వల్ల శుభాలు కలుగుతాయి. రథసప్తమి రోజున సూర్య గ్రహానికి ప్రీతికరమైన పనులు చేయాలి. ఎరుపురంగు దుస్తులు ధరించి, చిక్కుడి కాయలతో చేసిన రథంలో సూర్య ప్రతిమను పెట్టి దాయలు మీద ఆవు పిడకలతో ప్రసాదాన్ని వండి దేవునికి నైవేద్యం పెట్టాలి. దీని వల్ల ప్రకృతిలోని కొన్ని ధాతువులు మనకు శక్తినిస్తాయి. ఈరోజు ఎండ ఎంతో తీక్షణంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. ఈరోజున దానం తప్పక చేయాలి. దుస్తులు గానీ, ధనాన్ని గానీ, ఆహారాన్ని గానీ దానం చేయడం వల్ల అద్భుత ఫలితాలుంటాయి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఉపవాసం కూడా ఆచరిస్తే ధీర్ఘాయుష్షు కలుగుతుందరి వేద పండితులు చెబుతున్నారు.