News

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ కేసులో నిందితుల అరెస్టు

154views

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్‌లో డబ్బుల చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలోని 36వ కౌంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున రూ.2,47,250 నగదు చోరీ జరిగింది. వెంటనే సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమల కొండపై ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సీసీ ఫుటేజీను పరిశీలించారు. చోరీకి పాల్పడిన నిందితులు.. తిరుపతి దామినేడు ప్రాంతానికి చెందిన సీతాపతిగా గుర్తించారు. వెంగమాంబ బృందావనం సమీపంలో సీతాపతితోపాటూ తిరుమలలోని ఓ షాపులో పనిచేసే చందును అరెస్ట్ చేశారు. వారి దగ్గర రూ.2.47 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు.

ఘటనకు కారణాలు ఇవే..
శ్రీలక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన దగ్గరే ఉన్నాయి. అయితే కౌంటర్ గడియ పెట్టడం మరిచిపోయి లోపలే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారని టీటీడీ తెలిపింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.