
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ’నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం దరఖాస్తు కూడా చేయలేదని సమాచారం. కోనసీమలో జరిగే ‘ప్రభల తీర్థం’ థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సిద్ధం చేస్తోంది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ శకటం ఉంది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించడమే ప్రభల తీర్థం. అందుల్లో జగ్గన్నతోటలో జరిగే వేడుకలు మరింత ప్రత్యేకమైనవని కళాకారులు తెలిపారు. మరోవైపు భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్య మాదక ద్రవ్యాలు… వాటిపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం కల్పించింది.