News

పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా?

10views

ఉదయం, సాయంత్రం రాత్రి అనే తేడా లేదు.. ఇంట్లో కరెంటు ఉంటే ఒట్టు… పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. సాధారణంగా ఒక గంట విద్యుత్తు లేకతేనే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతుంటాయి. ఇదే సంక్షోభంలో పాకిస్థాన్‌ ఇప్పుడు ఉంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అవస్థలు పడుతుండగా.. ప్రస్తుతం విద్యుత్‌ సంక్షోభం కూడా తోడైంది. ఇప్పటికే తినడానికి తిండి కూడా దొరకక, గోధుమపిండి కోసం తొక్కిసలాటల్లో మరణాలు సంభవిస్తున్న దీనస్థితిలోకి చేరిన పాక్‌.. తాజాగా విద్యుత్‌ సంక్షోభంలోకి కూడా జారిపోయింది. దక్షిణ పాకిస్థాన్‌లోని నేషనల్‌ గ్రిడ్‌లో వైఫల్యం తలెత్తడంతో దేశంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌లోని జంషోరో, దాదుల మధ్య విద్యుత్‌ సరఫరా ఫ్రీక్వెన్సీలో మార్పులు, వోల్టేజీలో హెచ్చుతగ్గులు రావడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇస్లామాబాద్‌, కరాచీ, లాహోర్‌, పెషావర్‌ తదితర అన్ని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 7.30 గంటల నుంచే విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. సాయంత్రం వేళ అయినా కరెంటు రాకపోవడంతో విద్యుత్‌ ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలతో పాటు ఇళ్లల్లో ఉండే సామాన్య ప్రజలు కూడా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెజారిటీ ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా విద్యుత్తు సరఫరా ప్రారంభం కాలేదు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు చాలా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తాత్కాలికంగా సమస్య ఉంది.. : ఇంధన మంత్రి
దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పటికీ ఇది తీవ్ర సంక్షోభమేం కాదని పాక్‌ ఇంధన మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ అన్నారు. ‘‘శీతాకాలంలో విద్యుత్‌కు తక్కువ డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల రాత్రి సమయంలో విద్యుత్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తాం. అలాగే ఆదివారం రాత్రి కూడా నిలిపివేశాం. విద్యుత్‌ ఫ్రీక్వెన్సీలో మార్పుల వల్లే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో విద్యుత్‌ను పునరుద్ధరించాం. మిగిలిన ప్రాంతాలలోనూ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.